కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో 52 ట్రాన్స్‌ఫార్మర్ చోరీలు.. సాంకేతిక ఆధారాలతో ముగ్గురు నిందితుల అరెస్టు.. కాపర్ వైర్, బైక్ స్వాధీనం

TGNEWS24|కామారెడ్డి జిల్లా పోలీసులు అంతర్జిల్లా స్థాయిలో సాగుతున్న ట్రాన్స్‌ఫార్మర్ చోరీల ముఠాను ఛేదించారు. కామారెడ్డిలో 29, మెదక్ జిల్లాలో 23 చొప్పున మొత్తం 52 ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్ కాయిల్స్ చోరీ చేసిన కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు.
సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజీల సాయంతో ముఠాను గుర్తించిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిపై 52 చోరీ కేసులతో పాటు హత్యాయత్నం, రాత్రి పూట నివాసాల్లో దొంగతనం చేసిన కేసులు కూడా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
నిందితుల నుంచి 30 కిలోల కాపర్ వైర్, చోరీకి వినియోగించిన యమహా ఎఫ్‌జడ్ వాహనం, ఇతర చోరీ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా సొంత అన్నదమ్ములు కావడం గమనార్హం. వీరిలో కొందరు గతంలోనూ దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల సాయంతో కేసును పక్కాగా దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేరస్తులకు గట్టి హెచ్చరిక ఇస్తూ, ఇలాంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ అభినందించారు.