భారీ పోలీసు బందోబస్తు మధ్య లబ్ధిదారుల ఎంపిక.. అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆరోపణలు.. రాజకీయ జోక్యంపై సర్పంచ్ మండిపాటు
TG NEWS 24 | బీర్కూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఎంపిక ప్రక్రియ శుక్రవారం తీవ్ర ఉత్కంఠ మధ్య, భారీ పోలీసు బందోబస్తుతో జరిగింది. బీర్కూర్ రైతు వేదికలో బాన్సువాడ ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ సవాయి సింగ్ ఆధ్వర్యంలో అర్హుల ఎంపిక చేపట్టారు.
మొత్తం 36 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో మూడు ఇళ్లను అగ్ని ప్రమాద బాధితులకు కేటాయించగా, మిగిలిన 33 ఇళ్ల కోసం 500 మందికి పైగా దరఖాస్తులు వచ్చాయి. పరిశీలన అనంతరం అధికారులు 47 మందిని అర్హులుగా గుర్తించి, వారి నుంచి 33 మంది లబ్ధిదారులను డ్రా ద్వారా ఎంపిక చేశారు.అయితే ఈ ఎంపికపై పేదలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 47 మంది జాబితాలోనే అనర్హులు ఉన్నారని, ఆర్థికంగా బలంగా ఉన్నవారికి, లక్షల రూపాయల ఆస్తులు కలిగినవారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.
దీంతో గ్రామ సర్పంచ్ ధర్మతేజ ఆధ్వర్యంలో వందలాది మంది పేదలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక వెనుక రాజకీయ జోక్యం ఉందని వారు ఆరోపించారు.నిరసనల నేపథ్యంలో బాన్సువాడ డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్ఐలు, వంద మందికి పైగా పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తహసీల్దార్ కార్యాలయం నుంచి బీర్కూర్ ప్రధాన రహదారి వరకు పోలీసులు మోహరించి, రైతు వేదిక వైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దాదాపు రెండు గంటల పాటు భారీగా పోలీసులు మోహరించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఎంపికలో రాజకీయ జోక్యం జరిగిందని, నిజమైన నిరుపేదలను గుర్తించడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని సర్పంచ్ ధర్మతేజ ఆరోపించారు. నిజమైన నిరుపేదలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రచయిత: TGNEWS24
